సెంట్రల్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

ఆటవస్తువులు, బొమ్మలు

ఆటవస్తువులు, బొమ్మలు మనదేశంలో సింధు నాగరికత కాలం నుండీ ఉన్నాయి. వీటిని ఉత్సవాలలో మరియు పండుగల సందర్భాల్లో వాడేవారు. ఈ బొమ్మలు భారతీయ సంస్కృతిలో విడదీయరాని భాగం. ప్రతి ప్రాంతపు బొమ్మలకీ ఓ ప్రత్యేకత ఉంది. పూర్వకాలంలో మన కళాకారులు వారి పిల్లలకు జంతువుల, పక్షులు, దేవతల బొమ్మలను మట్టితో చేసిచ్చేవారు. పిల్లలు వీటితో ఆడుతూ జ్ఞానంతోబాటు మానసికానందాన్ని పొందేవారు.

ఆంధ్రప్రదేశ్‌ బొమ్మల తయారీకి ప్రసిద్ధికెక్కింది. కొండపల్లిలో ప్రాంతీయంగా దొరికే ముడి వస్తువులను వాడి బొమ్మలను చెక్కుతారు. ఈ గ్రామం విజయవాడకు దగ్గరలోనే ఉంది. ఇవి దేశంలోనేకాక విదేశాల్లోనూ పేరుకెక్కినవి. ఈ బొమ్మలను తెల్లపొనికి కర్రతో చేస్తారు. ఈ కర్ర మృదువుగా ఉండడం వల్ల కావలసిన ఆకారంలోకి సులువుగా తేవచ్చు. ఈ బొమ్మల్లో ముఖ్యంగా పక్షులు, పురాణగాథలు, వివిధ వృత్తులవారు మొ|| అంశాలుంటాయి. ఇవి సహజంగా, సజీవంగా ఉంటాయి. తాకినప్పుడు వాటి మృదుత్వం తెలిసిపోతుంది.