సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు / బిద్రి వస్తువులు
బిద్రి వస్తువులు
భారతీయ కళా ప్రపంచం పర్షియన్, తూర్పు దేశాల చిత్రలేఖనాలకే పరిమితం కాలేదు. రోజువారీ అతి సాధారణ వస్తువులను నాజూకైన, నగిషీలు చెక్కిన, అపురూప కళాకృతులుగా తీర్చిదిద్దడం వరకు సాగింది. ఈ కళకు పేరు తెచ్చింది బిదారి లేదా బిద్రి వస్తువులు. హైదరాబాద్‌కు 80 కి.మీ. దూరంలోని బీదర్ దీని జన్మస్థలం. ఇది ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
బిద్రి కళ దాదాపు 400 సం|| క్రితం బహమని, బిరిడి వంశాల పాలనలో మొదలై, వికసించి ఉన్నతస్థాయికి చేరింది.
దీని మూలధాతువు జింక్, రాగి, సీసంల మిశ్రమం. ఈ జింక్, రాగిల సమ్మేళనం తుప్పు పట్టదు. విరగదు. కానీ పెళుసుగా మారుతుంది.
18వ శ|| చివరికి భారతీయ సంప్రదాయకళలకు దుర్దినాలు వచ్చాయి. శతాబ్దాల తరబడి కళలను పోషించి, ప్రోత్సహించిన ఉన్నతవర్గాలవారు ఉదాసీనత చూపారు. ఈ వస్తువులు క్రమంగా సంపన్నవర్గాల ఇళ్ళ నుంచి మాయమయ్యాయి. ఒకప్పుడు బిద్రి వస్తువులు హైదరాబాద్ అంగళ్ళళో విరివిగా దొరికేవి. నిజాం రాజుల వద్ద ఉన్న ఆంగ్లేయ అధికారుల దృష్టి వాటిపై పడింది. వారిలో ఇ.బి.హైవెల్ భారతీయ చిత్రకళలో సంప్రదాయకతను పునరుద్ధరించడానికి కృషి చేస్తే, ఇ.ఇ.స్పైట్ అనే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగి బిద్రికళను పైకి తేవడానికి ఎంతో కృషి చేసాడు. అలా బిద్రి వస్తువులు సామాజిక మార్పులకు, అవసరాలకు అనుగుణంగా తమ రూపురేఖల్ని మార్చుకున్నాయి.
తొలిరోజుల నాటి బిద్రి వస్తువులు సాలార్జంగ్ మ్యూజియం, ది నేషనల్ మ్యూజియం-న్యూఢిల్లీ, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంలో రతన్‌టాటా సేకరణలుగా, హైదరాబాద్ ప్రసిద్ధికెక్కిన కుటుంబాల్లో ఉన్నవి. సాలార్జంగ్ మ్యూజియంలోని బిద్రి వస్తువులు రాశిలో, వాసిలో పేరెన్నికగన్నవి. ఇక్కడ ఆకారంలో, సైజులో, కళాత్మకతలో వైవిధ్యమున్న బిద్రి వస్తువులు దాదాపు 200 ఉన్నాయి. వీటిలో ఆకారాన్ని, డిజైను బట్టి హుక్కా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. ఇది వారి పనితనానికి గీటురాయి అని అన్ని వర్గాలవారూ మెచ్చుకుంటారు. తార్కాశి, తైహినిషాన్, జారీనిషాన్, జారుబులంద్, అఫ్తాబి వీటిలోని కొన్ని రకాలు. కొన్ని బంగారు పూతతో ఉన్నవి.
ఇంకా ఇక్కడ చిలుం (ఫైర్ కప్స్), మోనల్ (మౌత్ పీసెస్) ఉన్నవి. వెడల్పాటి ఒక పెద్ద సైజుల చిలుం మన కళ్ళను కట్టిపడేస్తుంది. సాధారణంగా పురుషుల సమావేశాల్లో, అంతఃపురాల్లో కన్పించే ముఖ్యమైన బిద్రి వస్తువులు సైలాబ్చి (వాష్ బేసిన్), అఫ్తాబా (ఎమర్). సైలాబ్చి పెద్ద సైజులో గుండ్రంగా ఉండి, మధ్య భాగంలో రంధ్రాలున్న మూత ఉంటుంది. అఫ్తాబా అనేది పర్షియన్ వైన్ పాత్ర ఆకారంలో ఉంటాయి. నిత్యజీవితంలో వాడే ఎన్నో వస్తువులు బిద్రి పద్ధతిలో తయారైనవి ఉన్నాయి. ఈ కళలో చేసినవి, అందమైన నగిషీలున్నవి ఎన్నో మ్యూజియంలో ఉన్నవి.
సైలాబ్చి (బేసిన్), బిడ్రివేర్, బీదర్, ఇండియా, 16 వ శతాబ్దం.
హుక్కా బేస్, బిడ్రివేర్, బీదర్, 19 వ శతాబ్దం చివరి.