సేకరణ
సాలార్‌జంగ్ మ్యూజియంలోని కళాకృతులు గతవైభవ చిహ్నాలు. ఇవి క్రీ.పూ. 2వ శ|| నుండి క్రీ.శ. 20 వ శ|| తొలినాళ్లవరకు విస్తరించి ఉన్నవి. ఈ మ్యూజియంలో 46,000 కు పైగా వస్తువులున్నాయి. అందులో 8,000 వ్రాతప్రతులు, 60,000కు మించిన ముద్రిత పుస్తకాలున్నాయి. ఈ సేకరణ అంతా 7 విభాగాలుగా విడదీయబడింది. అవి ఇండియన్ ఆర్ట్, మిడిల్ ఈస్ట్రన్ ఆర్ట్, పర్షియన్ ఆర్ట్, నేపాలీస్ ఆర్ట్, జపనీస్ ఆర్ట్, చైనీస్ ఆర్ట్ మరియు వెస్ట్రన్ ఆర్ట్‌లు. ఇవేకాక సాలార్‌జంగ్ ఫౌండర్స్ గ్యాలరీ పేరుతో సచిత్రంగా ఒక ప్రత్యేక గ్యాలరీ ఉంది. ప్రదర్శనా వస్తువులు 38 గ్యాలరీలుగా విభజింపబడినవి.
భారతీయ కళాసేకరణలో సూక్ష్మ చిత్రకళ, ఆధునిక చిత్రకళ, కంచు ప్రతిమలు, వస్త్రాలు, దంతం, జేడ్, బిద్రి వస్తువులు, ఆయుధాలు, కవచాలు, రాతి శిల్పాలు, దారు శిల్పాలు, లోహ వస్తువులు ఇంకా రాత ప్రతులున్నాయి. ఈ విభాగంలో ప్రాచీన ఆంధ్ర శిల్పాలు, మధ్యయుగపు చిత్రలేఖనాలు ఉన్నాయి.
సాలార్‌జంగ్ మ్యూజియాన్ని 1961లో జాతీయ ప్రాముఖ్యత కల సంస్థగా గుర్తించిన తరువాత అక్విజిషన్ కమిటీ ఏర్పడింది. దాని వలన ఆధునిక చిత్రకారుల చిత్రాలను కూడా పాతవాటికి జతచేసి ప్రదర్శించడానికి సాధ్యమయింది. బిద్రి వస్తువుల అతి పెద్ద సంగ్రహాలయం బహుశా ఇదే.
మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన పర్షియా, సిరియా ఈజిప్టుల తివాసీలు, లిఖిత ప్రతులు, పింగాణీ, గాజు, లోహ వస్తువులు, ఫర్నిచర్, లక్క వస్తువులు ఇక్కడున్నాయి. వీటిలో అనేక శ్రేణుల అలంకారికంగా, వర్ణనీయంగా నేసిన పర్షియన్ కార్పెట్లు మ్యూజియంలోని అపురూప సంపదలలో ఒకటి. ఈ కార్పెట్లపై ఖుస్రో కథలను కూడా నేశారు.
యూరోపియన్ దేశాల కళావస్తువులలో అద్భుతమైన తైల వర్ణ చిత్రాలు, ఆకర్షణీయ గాజు వస్తువుల నుంచి, హుందా అయిన ఫర్నిచర్, నైపుణ్యంతో తీర్చిదిద్దిన దంతపు, ఎనామిల్ వస్తువులు, గడియారాలున్నాయి. మ్యూజియంలో ఉన్న అతి విలువైన, అరుదైన కళాసంపదలో ఒకటి ముసుగులో ఉన్న రెబెకా పాలరాతి విగ్రహం. ఇది జి.బి.బెన్‌జోని అనే శిల్పి మలిచిన పాలరాతి విగ్రహం. దీనిని 1876లో ఒకటవ సాలార్‌జంగ్ ఇటలీనుంచి తెచ్చారు.
చైనా, జపాన్‌ల కళాకృతులను విస్తారంగా సేకరించి ప్రదర్శిస్తున్న అతికొద్ది మ్యూజియంలలో సాలార్‌జంగ్ మ్యూజియం ఒకటి. ఈ సేకరణలో పింగాణి, కంచు, ఎనామిల్, లక్క, ఎంబ్రాయిడరీ, చిత్రలేఖనాలు, దారువు ఇంకా ఇన్‌లే వస్తువులున్నాయి.
చిన్న పిల్లల సెక్షన్‌లో ప్రదర్శితమై ఉన్న వస్తువులను గమనిస్తే, సాలార్‌జంగ్ ఆసక్తులు, వైవిధ్య స్వభావం విశదమవుతుంది. ఇవి పిల్లలకు ప్రాథమిక విద్యతో బాటు ఆనందాన్నీ అందిస్తాయి. 20వ శ|| తొలినాటి మాడల్ రైలు కొద్ది దూరం ప్రయాణిస్తుంది కూడా. ఇక్కడ ఎక్కువమందిని ఆకర్షించేది ఇదే. ఇవే కాక ఇక్కడ పింగాణి, లోహం, జేడ్ వస్తువులూ, టాయ్ ఆర్మీ ఉన్నాయి.
ఇక్కడ అరుదైన, అపూర్వమైన పుస్తకాలతో బాటు అమూల్యమైన వ్యాఖ్యానాలున్న వ్రాతప్రతులున్నాయి.
చక్రవర్తులైన అక్బర్, ఔరంగజేబు, షాజహాన్ కుమార్తె అయిన జహానారా వంటి ప్రముఖుల రాచముద్రలు, సంతకాలున్న లిఖిత ప్రతులున్నాయి. ఈ గ్రంథాలను సేకరించిన పద్ధతి చూస్తుంటే మూడవ సాలార్‌జంగ్, ఆయన పూర్వీకులు గొప్ప సాహిత్య పోషకులని తెలుస్తుంది. భారతీయ కళాసాంప్రదాయాలను అర్థం చేసుకోడానికి ఈ మ్యూజియం ఒక కిటికీ వంటిది. అదే సమయంలో ఇది ఇతర దేశాల కళాసృష్టి పట్ల అవగాహననీ కల్పిస్తుంది.