గ్యాలరీలు

ప్రస్తుతం మ్యూజియంలో 3 బ్లాకులున్నాయి. అన్నింటినీ కలిపి 39 గ్యాలరీలున్నాయి. - (1) సెంట్రల్‌ బ్లాక్‌ (27 గ్యాలరీలు), (2) వెస్ట్రన్‌ బ్లాక్‌ (7 గ్యాలరీలు), (3) ఈస్ట్రన్‌ బ్లాక్‌ (4 గ్యాలరీలు), ఈ గ్యాలరీలన్నింటిలో కలిపి దాదాపు 14,000 వస్తువులు ప్రదర్శనలో ఉన్నవి. భారతీయ వస్తు సేకరణలో తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రాలకు చెందిన వస్తువులున్నాయి. అలాగే కాంగ్రా, బాశోలి, జైపూర్‌, ఉదయ్‌పూర్‌, మేవార్‌, హైదరాబాద్‌, గోల్కొండ, బిజాపూర్‌, కర్నూల్‌ మరియు నిర్మల్‌ ప్రాంతాలకు చెందిన కళాసంపద ఉంది. భారతీయ సేకరణలో రాతి శిల్పాలు, కంచు, దారు వస్తువులు, సూక్ష్మ చిత్రాలు, ఆధునిక పెయింటింగ్‌లు, దంతం, జేడ్‌, వస్త్రాలు, లోహ వస్తువులు, రాతప్రతులు, బిద్రి, ఆయుధాలు, కవచాలు, గృహోపకరణ వస్తువులు ఎన్నో ఉన్నాయి. ప్రాచ్య దేశాల సేకరణలో ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, ఇటలీ, జర్మన్‌, చెకోస్లవేకియా, వెనిస్‌ మరియు ఆస్ట్రియా దేశాల అపురూప కళాకృతులున్నాయి. తూర్పు దేశాలు అంటే చైనా, జపాన్‌, బర్మా, కొరియా, నేపాల్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేషియాల నుంచీ, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు అంటే ఈజిప్ట్‌, సిరియా, పర్షియా, అరేబియాలకు చెందిన అద్భుతమైన వస్తువులున్నాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం దేశంలోని జాతీయ మ్యూజియాలలో ఒకటి. అంతేకాక మ్యూజియాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. దాంతోబాటు ప్రపంచంలోనే అతి పెద్ద ఏక వ్యక్తి సేకరణల సంగ్రహాలయంగా పేరుకెక్కింది. ఈ మ్యూజియం హైదరాబాదుకు గర్వకారణం.