ఈస్ట్రన్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / ఈస్ట్రన్ బ్లాక్, మొదటి అంతస్తు / ఫార్ ఈస్ట్రన్ కలెక్షన్ - చైనావి
ఫార్ ఈస్ట్రన్ కలెక్షన్ - చైనావి
ఈ విభాగంలోని వస్తువులన్నీ వైవిధ్యంతో కూడుకొన్నవి. ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా అంతటిలోనూ చెప్పుకోదగిన సేకరణ ఇక్కడుంది. ఈ విభాగంలో దాదాపు 5000 వస్తువులతో చైనా, జపాన్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక్కడున్న వస్తువుల్లో 40% సాలార్జంగ్ స్వయంగా సేకరిస్తే, మిగిలినవి కుటుంబ వారసత్వంగా వచ్చినవి. మొదటి అంతస్థులో నాలుగు విభాగాలలో కలిపి చైనా, జపాన్‌కు చెందిన వస్తువులు సుమారు 960 దాకా ఉన్నవి. 12 నుండి 19వ శ||కు చెందిన చైనా పింగాణీ వస్తువులున్నాయి. ఇక్కడ దాదాపు 300 తొలి సంగ్ (క్రీ.శ. 960 - 1279), యువాస్ (క్రీ.శ. 1279-1386), మింగ్ (క్రీ.శ. 1386-1644), చింగ్ (క్రీ.శ. 1644-1912) కాలానికి చెందిన కళాకృతులున్నవి.
ఇందులో అతిప్రాచీనమైన 2 పళ్ళాలున్నవి. ఒక దాంట్లో లేచి ఉన్న డ్రాగన్, ఒక చేప, రెండో దాంట్లో డ్రాగన్ చిత్రాలున్నవి. ఇది 12, 13 శ||నికి చెందిన సుంగ్ కాలానివి. మింగ్ కాలానికి చెందిన వానిలో డైపర్ నమూనాతో, అంచుల్లో చెక్కిన మంచి డిజైన్లతో చేసిన పళ్ళాలు అనేకం ఉన్నవి. ఇవన్నీ 15వ శ||కి చెందినవి.
ఇవేకాక చెంగాటే కాలానికి చెందిన (క్రీ.శ. 1506-21) పూల డిజైన్లున్న రెండు అందమైన జాడీలున్నాయి.
ఈ విభాగంలో మింగ్ కాలపు (17వ శ||) అందమైన ఎంబ్రాయిడరీ చేసిన సిల్కు వస్త్రాలు చాలా ఉన్నాయి. ఒకదాంట్లో టావో మతంలో చిరంజీవిత్వానికి ప్రతీకగా భావించే దేవత చిత్రం ఉంది. ఇంకోదాంట్లో యూనివర్సిటీ పరీక్షా ఫలితాలను వెల్లడిస్తున్న వ్యక్తి చిత్రముంది. 18వ శ|| చెందిన జేడ్ నగిషీలను చూస్తే, చైనీయుల నైపుణ్యం ఎంత ఉత్తమ స్థాయికి చెందిందో అర్థమౌతుంది. చిన్లంగ్ గుర్తులు పరుచుకున్నట్లున్న జేడ్ బాక్సులు, పెనవేసి కొన్నట్లున్న 3 డ్రాగన్ బల్లులున్న ఒక స్టాండ్ కూడా కనిపిస్తుంది.