వెస్ట్రన్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

యూరోపియన్‌ గాజు విభాగము

ఈ మ్యూజియంలో ఉన్న గాజు వస్తువులు ఈ కళలో కళాకారులు సాధించిన విజయాలకు గురుతులు. ఇవి వెనిస్‌, ఫ్రాన్స్‌, ఇంగ్లాండు, అమెరికా, బొహిమియా, బెల్జియం, ఇస్తాంబుల్‌ దేశాల గాజు పనివారల నైపుణ్యము ఎంత ఉన్నతదశకు చేరిందో సందర్శకులకు తెలుపుతాయి.

వెనిస్‌, ఫ్రెంచ్‌ పనివారల కళాకృతులు ఇక్కడ ప్రదర్శింపబడుతున్నవి. వెనిస్‌ గాజు యొక్క అద్భుత లక్షణాలు ఏంటంటే తేలికగా ఉండడం, పెళుసుదనం, ప్రత్యేకమైన డిజైన్లు, అతుకులు కన్పించని తయారీ. కొన్ని వస్తువులు రంగులు వేసి, ఎనామిల్‌ చేసి మానవాకృతిని, పూల డిజైన్లను బంగారు రంగుతో అలంకరించారు. రెండు వాజ్‌ల్లో ఎనామిల్‌ చేసి, రంగులద్ది స్త్రీ పురుష రూపాల్లో ముఖం మీద ముసుగులతో సహా రూపొందించారు. మిగిలిన వస్తువులు కూడా వాటి డిజైను, ఆకారం, మెరుస్తున్న ఆభరణాల అలంకరణతో వాటిని తయారుచేసిన కళాకారుల శైలిని మన కళ్ళముందు నిలుపుతున్నవి.

ఇంగ్లీషు గాజు సేకరణ 18వ శ|| చివర, 19వ శ|| తొలిరోజుల్లోని కళాకారుల రీతులను, సామర్థ్యానికి గుర్తులు. 18వ శ||లో తయారైన గాజు లావణ్యంగాను, పలుచగాను, సమతూకంగాను ఉండేది. ఈ మ్యూజియంలో గాలి పురి పెట్టబడి, రెండుమార్లు మెలి తిప్పిన వైన్‌ గ్లాసులున్నవి. ఇక్కడ డైమండ్‌ ఆకారంలో చెక్కి అమెరికన్‌ ప్రెస్స్‌డ్‌ గాజు ఎక్కువ భాగం 19వ శ||కి చెందినవి ఉన్నవి.

మ్యూజియంలో అందమైన షాండిలియర్లు, గోడకుంచే బ్రాకెట్లు, చీకాలు, హండి, దీపాలు అన్నీ 18, 19 శ|| చెందినవి చాలా ఉన్నవి. ఇవి బహుశా ఫ్రాన్స్‌, ఇస్తాంబుల్‌, ఐర్లాండ్‌, వెనిస్‌ నుండి వచ్చి ఉండవచ్చు. కొన్ని బంగారుపూతతో ఉన్న ఇటలీదేశపు షాండిలియర్లు కూడా ఉన్నవి. ఈ రకానికి చెందినవానిలో కొన్ని షాండిలియర్లు జేడ్‌ రూంలోను, పీరియడ్‌ రూంలోను, గ్లాసు రూంలోను ఉన్నవి.