సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, క్రింది అంతస్తు / భారతీయ సూక్ష్మ చిత్రకళ
భారతీయ సూక్ష్మ చిత్రకళ
భారతీయ సూక్ష్మ చిత్రాల అధ్యయనం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. కాగితాన్ని కనిపెట్టక పూర్వం అంటే దాదాపు 14వ శ||లో గోడల మీద, బట్టల మీద, చెక్కపలకలు, తాటాకుల మీద చిత్రించేవారు. 15, 16 వ శ|| కాలంనాటి గుజరాతీ శైలిలో కల్పసూత్ర, కాలకాచార్య కథ మొ|| జైన్ మత గ్రంథాల చరిత్ర లిఖిత ప్రతులున్నాయి. వీటన్నింటిని ఈ మ్యూజియంలో చూడవచ్చు.
తొలినాటి సచిత్ర జైన కల్ప సూత్రాలు ప్రాచీన కాలానికి చెందిన పశ్చిమ భారత చిత్రలేఖనాలు. వీటిలో లాండ్ స్కేప్‌లు, రంగుల వాడకం, కళ్ళను ప్రస్ఫుటంగా చిత్రించడం వీటి ప్రత్యేకతలు. వీటిలో అంశం జైన పురాణగాథలు, బాలగోపాల స్తుతి బ్రాహ్మనికల్ శైలిలో, జైనకల్ప సూత్రాల విధానంలో చిత్రించబడింది.
16వ శ|| తొలిరోజుల్లో భారతీయ సూక్ష్మ చిత్రకళలో మంచి పురోగతి కన్పిస్తుంది. భారతీయ, పర్షియన్ సాహిత్యంలోని ముఖ్య సంఘటనలను చిత్రించడం అక్బర్ కాలంలోని మొగల్ శైలి ప్రత్యేకత. ఈ కాలంలో భారతీయ, పర్షియన్ సంప్రదాయాలను మిళితం చేసి చిత్రించారు. ఈ పద్ధతి రాజకుమారుని జననం అనే చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. 16వ శ||కి చెందిన బిచిత్తారా వేసిన రాజా విక్రమాదిత్య అనే చిత్రం మరో అద్భుత ఉదాహరణ.
ఈ మ్యూజియంలో దక్కన్ ప్రాంతపు సచిత్ర రాతప్రతులు, సూక్ష్మ చిత్రాలు విరివిగా కనబడతాయి. బీదర్‌కు చెందిన లిఖిత ప్రతులలో భోగ్బాలు అనేది మ్యూజియానికే ప్రత్యేక ఆకర్షణ.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి గోల్కొండ, బిజాపూర్ల ప్రాంతాలకు చెందిన లిఖితప్రతులు. జంషీద్ ఇబ్రహీం ఖులి ముచ్చటిస్తున్నట్లున్న పెయింటింగ్ మ్యూజియంకే గర్వకారణం.
సూక్ష్మ చిత్రకళలో రాజస్థాన్ పేరు గాంచింది. రసపోషణకు ఈ ప్రాంతం చిరునామాగా నిలిచింది. ప్రాంతీయ అభిరుచులను రాజపుత్ర సంప్రదాయం, మొగల్ సంప్రదాయాలను మేళవించడం వీటి ప్రత్యేకత. 17వ శ|| మధ్య కాలం నాటి మాల్వా చిత్రాల్లో రామాయణ సంఘటనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విభాగంలో మేవార్ సంప్రదాయానికి చెందిన బిహీరీ సత్పాయి చిత్రాలు కూడా ఉన్నవి. 18వ శ|| మధ్య భాగంలో అంబర్‌లో వేసిన రాగమాల అనే శీర్షికతో ఉన్న 3 పెయింటింగ్‌లు ఇక్కడ కొలువుదీరాయి.
అంతేకాక పంజాబ్‌లోని పహరీ ప్రాంతం, బాషోలి, కాంగ్రా ప్రాంతాలకు చెందిన చిత్రాలున్నవి. రాజా సంసార్‌చంద్ (ఇతని కాలంలోనే పహరీ చిత్రకళ అత్యున్నతస్థాయికి చేరింది) తన కొడుకు, సభికుల సమక్షంలో జన్మాష్టమి వేడుకలను చూస్తున్నట్లున్న చిత్రం ఈ ప్రాంతపు చిత్రకళకు గొప్ప ఉదాహరణ. మ్యూజియం ఘనతను పెంచినవాటిలో బిలాస్‌పూర్‌కు చెందిన గువేర్ వాసి రాజాప్రకాశ్చంద్ చిత్తరువు, కృష్ణరాసలీల చిత్రాలు ముఖ్యమైనవి.