సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు
- హోమ్ / గ్యాలరీలు / సెంట్రల్ బ్లాక్, మొదటి అంతస్తు / జేడ్ విభాగం
జేడ్ విభాగం
సాలార్జంగ్ మ్యూజియం - హైదరాబాద్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం - ముంబాయి, భారత్ కళాభవన్ - వారణాసి, ఫోర్డ్ మ్యూజియం - న్యూఢిల్లీ లలో తప్ప దేశంలో ఏ మ్యూజియంలోనూ జేడ్ వస్తువులు లేవు. ఈ పరిస్థితిలో సాలార్జంగ్ మ్యూజియంలోని జేడ్ సేకరణకు చాలా ప్రాధాన్యత వచ్చింది. ఇక్కడ రంగు, రూపం, వైవిధ్యత, నైపుణ్యం అన్నింట్లోనూ ప్రత్యేకత కనిపిస్తుంది. బహుశా ఇంత విస్తృతమైన జేడ్ వస్తు సేకరణ మరెక్కడా లేదు. జేడ్ సున్నితమైన, సెమి ప్రెషియస్ రాయి. ఈ రాళ్ళు తెలుపు, ఎమరాల్డ్ ఆకుపచ్చ నుండి నలుపు కలిసిన ఆకుపచ్చ- ఇలా అనేక వర్ణాలలో ఉంటాయి. కళ్ళకింపైన రంగులు, ఎంతో దృఢత్వం కలిగిన ఈ జేడ్ రాయి శిల్పకారులకు ఆసక్తి కలిగిస్తుంది. వారు దీంతో వారి ఊహలకు రూపమిచ్చారు. ఒకప్పుడు రాజులు, ఉన్నత వర్గీయులు దీన్ని ధరించడం హోదాకు చిహ్నంగా భావించేవారు. వారి సేకరణలో కొన్నైనా జేడ్ వస్తువులుండేలా చూసుకునేవారు.
చరిత్రకారుల అభిప్రాయంలో మొగల్ చక్రవర్తుల కాలంలో జేడ్‌ను ధరించడం మొదలయ్యింది. 16వ శ|| ముందు మన దేశంలో ఈ సంప్రదాయం లేదు. అందువల్లనే మన శిల్పకారులు కఠినమైన క్రిస్టల్, ఎగేట్లకు రూపమిచ్చినా జేడ్లను ముట్టుకోలేదు.
సామర్ఖండ్ పాలకుడైన తైమూర్ మనుమడైన ఉలుగ్బేగ్ ప్రోత్సాహంతో జేడ్ శిల్పకళా ప్రక్రియ మొదలైందని అంటారు. ఈయన 15వ శ|| వాడు. ఈ మ్యూజియంలో జహంగీర్‌కు చెందిన, నగిషీలు చెక్కిన డాగర్ ఉంది. జహంగీర్ తర్వాత వచ్చిన షాజహాన్ కూడా జేడ్ శిల్పకారులను ప్రోత్సహించాడు. ఇతని కాలంలోనే ఈ కళ శిఖరాగ్రస్థాయికి చేరుకున్నది.
ఇక్కడున్న జేడ్ కళాకృతులు వైవిధ్యంతో కూడిన డిజైన్లతో శిల్పుల పనితనానికి సజీవ చిహ్నాలుగా నిలిచాయి. వీటిలో చాలాభాగం సంప్రదాయిక డిజైన్లయిన లతలు, తీగలు, పూలతో అత్యద్భుత దీప్తి, లావణ్యంతో ప్రకాశిస్తున్నవి. వీటిలో చాలా భాగం ఖరీదైన వజ్రాలు, కెంపులు, పచ్చలు, మరకతాలతో అలంకరించబడి ఉన్నాయి.
మ్యూజియంలో వైన్ పాత్రలు, అద్దాల ఫ్రేములు, హుక్కా గొట్టాలు, కప్పులు, తాయెత్తులు మాత్రమేకాక కత్తులు, డాగర్లు కూడా ఉన్నాయి. నైపుణ్యం, డిజైన్ బట్టి ఇవి 17 నుండి 19 వ శ|| చెందినవని నిర్ణయింపబడినవి.
చారిత్రక ప్రాధాన్యం కల్గిన డాగర్లలో రెండు షాజహాన్‌కు, నూర్జహాన్‌కు చెందినవి. ఇక్కడ ఔరంగజేబ్‌కు చెందినట్టి, జేడ్ పిడి ఉన్న డాగర్ కూడా ఉన్నది. ఇక్కడ సుమారు 130 డాగర్లకు జేడ్‌తో చేసిన పిడులున్నాయి. కొన్నింటికి ఖరీదైన రాళ్ళు పొదిగారు.