సెంట్రల్‌ బ్లాక్‌, మొదటి అంతస్తు

గృహోపకరణాలు

చూడ్డానికి ఈ గ్యాలరీ అతి సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఒక్క క్షణం ఆగి శ్రద్ధగా పరిశీలిస్తే, అవన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరో ఒకరికి స్వంతం అనీ, వాటిలో మమత, ఆత్మీయత దాగి ఉన్నాయనిపిస్తుంది. అతిసాధారణమైన లోటాలు (గ్లాసులు), పూజాస్టాండులు, సోఫాకవర్లు, హుక్కా స్టాండులు, అడకత్తెరలు, మేకప్‌ సామాన్లుంచే భరిణలు ఎన్నో. దేని ప్రత్యేకత దానిది. ఇవి ఎవరివో, వారు ఎప్పుడు, ఎలా వాడేవారో, ఇంట్లోని అనేక వస్తువుల్లో ఇదొకటా? తరతరాలుగా వస్తున్నవా? వారు వీటిని వాడేవారా? జాగ్రత్తగా దాచేవారా? వీటిని చూడగానే బోలెడు సందేహాలు వస్తాయి. ఇవి ఖరీదైన జేడ్‌ లేదా పింగాణి వస్తువులు కాకపోవచ్చు. కానీ ఇవి ఊహల్లోంచి పుట్టినవి. నైపుణ్యంతో అలంకరించినవి. కుదురుగా ఉండేవి. వీటితో ఒక పెద్ద నగలపెట్టె, పాన్‌దాన్‌, మసాల డబ్బాలు, ముఖం ఆకారంలో ఉన్న మేకప్‌ బాక్స్‌, స్త్రీ ఆకారంలో పిచికారీ, సామోవర్‌ (వాటర్‌ నేచర్‌) తప్పక చూడాల్సినవి. ఇక్కడున్న వస్తువులు సందర్శకుని కళ్ళకు 18, 19 శ|| భారతీయ సాంప్రదాయిక గృహాలని పరిచయం చేస్తాయి.