సెంట్రల్‌ బ్లాక్‌, క్రింది అంతస్తు

చేతికర్రలు

చాలా ప్రాచీన కాలం నుండి చేతికర్రల తయారీ వాడకం మన దేశంలో ఉంది. ఇది మనకు గొప్ప నేస్తం. ఇది పెద్దవారికి సహాయంగానూ, యువతరానికి ఆయుధంగానూ పని కొచ్చేది.

తొలినాళ్ళలో ఇది గిరిజనుల నాయకుని అధికార చిహ్నంగా, గ్రామాధికారులకు, పశువుల కాపరులకు సహాయంగా ఉండేది. పాతరోజుల్లో ప్రవక్తలు చెక్క చేతికర్రలను ఉపయోగించేవారు అనేది ఒక చారిత్రక సత్యం.

కాలం గడిచేకొద్దీ చేతికర్ర రాజదండంగా రూపు మార్చుకుని అధికారానికి, శక్తికి చిహ్నంగా మారింది. అలాగే యజమాని హోదాను బట్టి విలువైన రాళ్ళతో, బంగారంతో అలంకరించడం మొదలైంది.

17, 18 శ||ల్లో యూరోపియన్లు, ఇతరులు దీని ఫ్యాషన్‌కు చిహ్నంగా వాడడంతో మరిన్ని మార్పులు వచ్చాయి. ధనవంతులు వారి స్థాయికి తగిన హంగులను జత చేస్తే, సామాన్యులు సాధారణమైన వాటిని వాడేవారు.

వీటికి ప్రాముఖ్యత పెరిగేకొద్దీ తయారీదార్లు మరింత శ్రద్ధతో బాగా సమయం వెచ్చించి, విలువైన రత్నాలు చేర్చి, ధనవంతుల అభిరుచికి తగ్గట్టు చేయడం మొదలెట్టారు. అందులో కొన్ని మన మ్యూజియంలో కొలువుదీరాయి.

ప్రదర్శనకు వెదురు, మలక్కా వెదురు, కర్ర, చందనం, దంతం, చేప ఎముక, జేడ్‌, గాజు, తోలుతో చేసిన చేతి కర్రలున్నాయి. కొన్నింటికి సెమి ప్రెషియస్‌ రాళ్ళతో చేసిన పిడులున్నాయి. ఈ విభాగంలోనివన్నీ సాలార్‌జంగ్‌ కుటుంబసభ్యుల సేకరణ.